Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

కూల్చేసే వారి కాళ్లు రెక్కలు విరిచి పడేస్తారు : సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు

నూతన సచివాలయం విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీవ్రంగా స్పందించారు. తాము అధికారంలోకి వస్తే కొత్త సచివాలయం డోమ్ ను కూల్చేస్తామంటూ ప్రకటించారు. ఇక… పీసీసీ చీఫ్ రేవంత్ మాట్లాడుతూ…. ప్రగతి భవన్ ని నక్సలైట్లు పేల్చేయాలని, దానితో సామాన్య ప్రజానీకానికి ఏమీ లాభం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వీరిద్దరికీ కౌంటర్ ఇచ్చారు. ప్రగతి భవన్ ను పేల్చేస్తే, సచివాలయం గుమ్మటాలను కూల్చేస్తే చూస్తూ ఊరుకుంటామా అని అన్నారు. అలాంటి పనులు చేయాలనుకునేవారి కాళ్లు రెక్కలు విరిచి పడేస్తారని సీఎం హెచ్చరించారు. అలా మాట్లాడిన వారిని ప్రజలే చూసుకుంటారని చెప్పారు.

 

బీజేపీ చెప్పే ముచ్చట్లు, ప్రదర్శిస్తున్న జులుం, పెడుతున్న కొట్లాటలన్నీ తాత్కాలికమని, ఎన్నో రోజులు ఉండబోవని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 2024లో బీజేపీ ఓటమి వందశాతం ఖాయమని స్పష్టంచేశారు. ‘బంగ్లాదేశ్‌ యుద్ధం గెలిచిన సందర్భంలో ఇందిరాగాంధీని స్వయంగా వాజ్‌పేయి పొగిడారు. దుర్గామాతగా అభివర్ణించారు. ఇక ఆమెకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఎదురేలేదని అందరూ భావిస్తున్న తరుణంలో ఒక్క అలహాబాద్‌ హైకోర్టు జడ్జిమెంట్‌ ద్వారా చెలరేగిన నిప్పుతో ఏం జరిగిందో అందరికీ తెలుసంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

 

దేశంలో బీజేపీ పాలన గుడ్దెద్దు చేలో పడ్డట్టుగా సాగుతున్నదని విమర్శించారు. మంచిది, చెడ్డది అని చూడకుండా అన్నింటినీ, అంతులేకుండా ప్రైవేట్‌పరం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధ్యతల నుంచి తప్పుకోవడమే కాకుండా ఏకంగా పారిపోతున్నదని, ఇదేమని అడిగితే సహించలేకపోతున్నదని మండిపడ్డారు. కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో, పేద ప్రజల కోసం కొన్ని రంగాల్లో కచ్చితంగా ప్రభుత్వం తగిన పాత్ర పోషించాల్సి ఉంటుందని, కానీ మోదీ ప్రభుత్వం వ్యాపారం చేయబోమంటూ తప్పించుకోజూస్తున్నదని ఆరోపించారు.

 

మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకూ జనగణన చేపట్టడం లేదని, తన బండారం బయటపడుతుందనే ఇలా చేయడం లేదని ఆరోపించారు. జనాభా లెక్కలు చేయకుండా ఏ దేశం కూడా పాలన చేయడం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ దేశాన్ని ముంచేశాయని, రెండు పార్టీలూ దొందు దొందేనని విమర్శించారు. కాంగ్రెస్ ది లైసెన్స్ రాజ్, మోదీ సైలెన్స్ రాజ్ అంటూ ఘాటు విమర్శలు చేశారు. అప్పులు చేయడంలో మోదీని మించిన ఘనుడు లేరని, మోదీ తెచ్చిన ఏ పాలసీ సక్సెస్ అయ్యిందో చెప్పాలని సవాల్ విసిరారు. మేకిన్ ఇండియా, నోట్లర ద్దు ఇలా… ఏది సక్సెస్ అయ్యిందో చెప్పాలని సవాల్ విసిరారు. ఒక్క వందే భారత్ రైలును మోదీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారని, బర్రె గుద్దితే.. వందే భారత్ రైలు పచ్చడైందని ఎద్దేవా చేశారు.

 

Related Posts

Latest News Updates