జగిత్యాల వేదికగా సీఎం కె. చంద్రశేఖర్ రావు కీలక ప్రకటన చేశారు. ఆలయాభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేశారు. కొండగట్టులో అద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని చెప్పారు. యాదాద్రిలాగే కొండగట్టును కూడా అభివృద్ధి చేస్తామని, ప్రఖ్యాత స్థపతులను తీసుకొస్తామన్నారు. ఇప్పటికే 384 ఎకరాలు అంజన్న దేవాలయానికి మంజూరు చేశామన్నారు. తెలంగాణలో పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయని వాటన్నింటినీ అభివృద్ధి చేసుకుందామన్నారు. అంతేకాదు బండలింగాపూర్ను మండలంగా ఏర్పాటు చేస్తామని జగిత్యాలలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో చెప్పారు. జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేసుకోవడమే కాదు.. ఇవాళ ఒక అద్భుతమైన కలెక్టరేట్ నిర్మాణం చేసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారుల, ప్రజలను హృదయపూర్వకంగా అభినందలు, శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ ప్రపంచంలో రైతు బంధు ఇచ్చే రాష్ట్రం ఎక్కడా లేదని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రైతుబంధు, రైతు బీమా ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. మరో 10 రోజుల్లో రైతుల ఖాతాల్లోకి రైతు బంధు జమ అవుతుందని సీఎం ప్రకటించారు. కేసీఆర్ బతికున్నంత వరకూ రైతు బంధు, రైతు బీమా ఆగదని స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందన్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాలపై అందరూ అప్రమత్తంగా వుండాలని, లేదంటే ప్రమాదంలో పడతామని హెచ్చరించారు. భారత రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.