నాందేడ్ లో నిర్వహించిన బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ సక్సెస్ అయ్యింది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలు, సరిహద్దు గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్ లో నాందేడ్ కి బయల్దేరారు. మొదట గురుద్వారాను సందర్శించుకున్నారు. తదనంతరం సభా స్థలికి చేరుకొని, శివాజీ, అన్నాభావు సాఠే, బసవేశ్వర, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ… దేశంలో గుణాత్మక మార్పు తీసుకొచ్చేందుకే జాతీయ స్థాయి రాజకీయాల్లో పనిచేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. అందుకే బీఆర్ఎస్ ను స్థాపించామని వివరించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత్ లో చాలా పార్టీలు అధికారంలో వున్నాయని, దేశాయని పాలించాయని, అయినా.. ప్రజల బాగోగులు ఏమాత్రం మారలేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఏకమైతే కేంద్రంలో కిసాన్ సర్కార్ ఏర్పాటవుతుందని అన్నారు. అందుకే తాము ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్న నినాదాన్ని ఎత్తుకున్నట్లు ప్రకటించారు. 75 ఏండ్లు గడిచినా ప్రజలకు తాగు, సాగునీరు, విద్యుత్తు వంటి కనీస అవసరాలు కూడా తీరలేదని ఆవేదన వ్యక్తంచేశారు.ఒకప్పుడు టీఆర్‌ఎస్ పేరుతో తెలంగాణకే పరిమితమైన పార్టీ.. ఇటీవలే బీఆర్‌ఎస్‌గా మారిందని చెప్పారు. దేశంలోని దుర్భర పరిస్థితులను నిశితంగా గమనించిన తర్వాత.. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించుకొన్నానని అందుకే బీఆర్ఎస్ ను స్థాపించామని వివరించారు.
తెలంగాణ బడ్జెట్ 2.5 లక్షల కోట్లు అని, మహారాష్ట్ర బడ్జెట్ 5 లక్షల కోట్లు అని సీఎం కేసీఆర్ వివరించారు. తెలంగాణలో వున్న సంక్షేమ పథకాలు ఇక్కడ ఎందుకు లేవని ప్రశ్నించారు. మహారాష్ట్రలో గులాబీ జెండా ఎగురవేస్తే ఇక్కడా ఆ పథకాలు వస్తాయన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే.. దేశ వ్యాప్తంగా ఏటా 25 లక్షల కుటుంబాలకు దళిత బంధు అందిస్తామని ప్రకటించారు. తెలంగాణలో రాయితీపై గొర్రెలు అందిస్తున్నామని, మత్స్యకారులు, గీతకార్మికులు…. ఇలా అందరికీ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.