తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హఠాత్తుగా ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. షెడ్యూల్ ఎలా వుంటుంది? ఎవరెవర్ని కలుస్తారు? అనేది మాత్రం ఇంకా అధికారికంగా బయటికి మాత్రం వెళ్లడి కాకపోవడం గమనార్హం. సోమవారం రాత్రి ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరారు. ఆయన వెంట ఎంపీ సంతోశ్ కుమార్, రంజిత్ రెడ్డి, తదితరులు వున్నారు. అయితే.. దాదాపు 3 రోజుల పాటు సీఎం కేసీఆర్ ఢిల్లీలో వుంటారని తెలుస్తోంది. అయితే… ప్రగతి భవన్ వర్గాలు మాత్రం ఎన్ని రోజులు వుంటారన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఇక… ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాద పూర్వకంగా కలుసుకోనున్నారని మాత్రం ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ సీఎంవో రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోసం రాష్ట్రపతి భవన్ వర్గాలను సంప్రదించినట్లు కూడా వార్తలొస్తున్నాయి.
మరోవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా నడుస్తున్నాయి. కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. కేంద్రానికి తెలంగాణ తీవ్ర అన్యాయాన్ని చేస్తోందని, అలాగే రాష్ట్ర అప్పులపై ఆంక్షలు కూడా విధిస్తోంది. ఈ నేపథ్యంలో తానే స్వయంగా ఢిల్లీలో వుంటూ.. ఎప్పటికప్పుడు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేయాలన్న ఆలోచనలో కూడా సీఎం కేసీఆర్ వున్నట్లు ప్రచారం జరుగుతోంది.