విపక్షాల రాష్ఠ్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా గెలుపుతో దేశ గౌరవం రెట్టింపు అవుతుందని తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర రావు అన్నారు. రాష్ట్రపతిగా మంచి వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత రాజకీయాల్లో సిన్హా గొప్ప వ్యక్తి అని, న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి, కేంద్ర మంత్రిగా ఎదిగారన్నారు. హైదరాబాద్ లోని జలవిహార్ లో యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి మద్దతుగా జరిగిన సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తన పనితీరుతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారని, అందుకే ఎంపీలందరూ ఆత్మప్రబోధానుసారం యశ్వంత్ సిన్హాకు ఓటు వేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సిన్హా గెలవాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, గెలుస్తారన్న నమ్మకం వుందని చెప్పుకొచ్చారు.
తాను ప్రధానిగా పర్మినెంట్ అన్న భ్రమలో ప్రధాని మోదీ వున్నారని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. ప్రధాని రెండు రోజుల పాటు హైదరాబాద్ లో వుండబోతున్నారని, రేపటి సభలో తమ గురించి ఏదేదో మాట్లాడతారని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అలా మాట్లాడే హక్కు కూడా వుందని, అదే ప్రజాస్వామ్యమని అన్నారు. అయితే.. అంతకు ముందు తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలు కావాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.
”ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటైనా పూర్తి చేశారా? చేస్తే ఏం చేశారో చెప్పండి. అడిగేది నేను కాదు. ప్రజలు. దేశంలో రైతుల భాగస్వామ్యం చాలా పెద్దది. వారి ఆదాయం డబుల్ చేస్తామన్నారు. చేశారా? ఖర్చు మాత్రం డబుల్ అయిపోయింది. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ చాలా రోజుల పాటు ఉద్యమం నడిచింది. ఈ సమయంలో రైతులపై చాలా ఆరోపణలు చేశారు. ఉగ్రవాదులంటూ విరుచుకుపడ్డారు. మనస్సుకు ఏది వస్తే అదే మాట్లాడారు. మోదీ హయాంలో ఎవరూ సంతోషంగా లేరు. మోదీ తప్పుడు నిర్ణయాల వల్ల 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయినా మోదీకి బాధలేదు. తాము పర్మినెంట్ అన్న భ్రమలో మోదీ వుండిపోతున్నారు.” అంటూ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు.