కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏటా తమ ఆస్తుల వివరాలు వెల్లడించాలంటూ సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఉపాధ్యాయ లోకం నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. ఈ ఆదేశాలను తక్షణమే నిలిపేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. జీవో నిలిపివేత ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని కూడా విద్యాశాఖ కార్యదర్శిని మంత్రి సబితా ఆదేశించారు.
ప్రభుత్వ టీచర్లు తమ ఆస్తుల వివరాలను ఏటా ప్రభుత్వానికి సమర్పించాలని అంతకు ముందు తెలంగాణ సర్కార్ సంచలన జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. స్థిర, చర ఆస్తులు అమ్మినా.. కొన్నా.. ముందస్తు అనుమతి కూడా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ వార్షిక ప్రాపర్టీ స్టేట్ మెంట్ సమర్పించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. నల్లగొండలోని ఓ ఉపాధ్యాయుడి వ్యవహరంపై విజిలెన్స్ రిపోర్టు ఇవ్వడంతో విద్యాశాఖ ఈ జీవో జారీ చేసింది.