అత్యంత దార్శనికతతో, యువ మేధస్సు ప్రపంచంతో పోటీ పడేలా టీ-హబ్ 2.0 ను ఏర్పాటు చేసుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కె, చంద్రశేఖర రావు అన్నారు. భారత దేశ స్టార్టప్స్ రాజధానిగా తెలంగాణ మారనుందని ప్రకటించారు. ఆధునిక భారత నిర్మాణమే లక్ష్యమని ప్రకటించారు. రాయదుర్గం నాలెడ్జి సిటీలో 400 కోట్ల రూపాయలతో నిర్మించిన టీహబ్ 2.0 ను సీఎం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం దేశ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ప్రపంచ పోటీ తత్వాన్ని ఎదుర్కొని, సామర్థ్యాన్ని నిరూపించుకోవాలన్న తపన యువతలో ఎంతో వుందని, దీనిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందన్నారు.
తెలంగాణ స్టార్టప్ పాలసీ దేశానికే రోల్ మోడల్ అని ప్రకటించారు. టీహబ్ ఇప్పటికే రెండు వేల మంది పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి, 1.19 బిలియన్ అమెరికన్ డాలర్ల మార్కెట్ ను చేసిందని, టీహబ్ ప్రపంచంలోనే పేరొందిన పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటలిస్టులను అనుసంధానం చేసేవిధంగా పనిచేస్తుందని సీఎం వివరించారు. సృజనాత్మక అవిష్కరణలకు ప్రత్యేక బ్రాండ్‌ను తీసుకొచ్చింది.
స్టార్టప్‌లతో యువ వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు దేశ యువత ఆసక్తిగా ఉన్నట్టు టీ-హబ్ మొదటి ఫేజ్‌తోనే స్పష్టమైందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇలా పనిచేస్తున్న వారికి మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరాన్ని గుర్తించి, అత్యాధునిక హంగులతో టీహబ్ 2.0 ను ప్రారంభించామని, తెలంగాణ స్టార్టప్ దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులుగా నిలవాలన్నదే తమ లక్ష్యమని కేసీఆర్ తెలిపారు.
మంత్రి కేటీఆర్ బృందానికి అభినందనలు
టీహబ్ నిర్మాణంలో విశేషంగా కృషి చేసిన మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ కార్యదర్శి, ఇతర అధికారలను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్ ది బెస్ట్ లివింగ్ సిటీగా తీర్చిదిద్దుదామని సీఎం కేసీఆర్ అన్నారు. స్టార్టప్ లు సులువుగా కార్యకలాపాలు సాగించేందుకు ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. స్టార్టప్ సిస్టమ్ లో దేశ వ్యాప్తంగా ప్రతిభ వున్న వారిని ప్రోత్సహించేందుకు టీహబ్ అండగా వుంటుందని భరోసా కల్పించారు. మరోవైపు టీహబ్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్, అధికారులతో పూర్తిగా కలియతిరిగారు. వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫెసిలిటీ సెంటర్ ప్రత్యేకతలను అధికారులు వివరించారు.