ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను విచారిస్తుండగానే… ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మీయ సందేశం పేరిట పార్టీ శ్రేణులకు కీలక సందేశం ఇచ్చారు. అన్నంతినో… అటుకులు తినో… ఉపవాసం వుండో 14 ఏళ్లు పేగులు తెగేదాక కొట్టాడి… తెలంగాణను సిద్ధింపజేసుకున్నామని అన్నారు. అధికారం లేకున్నా… ఉద్యమ కాలంలో జెండా భుజాన వేసుకొని, లాఠీలకు, జైళ్లకు వెరవకుండా రేయింబవళ్ల శ్రమించి పార్టీని కాపాడుకున్న ఘనత గులాబీ సైనికులకే దక్కుతుందని పేర్కొన్నారు.
ప్రజల ఆశీర్వాదం, నిబద్ధత కలిగిన లక్షలాది కార్యకర్తల అసమాన పనితనంతో అపురూప విజయాలు సాధించి, 2 సార్లు అధికార పగ్గాలు చేపట్టామన్నారు. పట్టుదల, అంకిత భావంతో పనిచేస్తూ కార్యకర్తల బలంతోనే 60 లక్షల సభ్యత్వంతో అజేయమైన శక్తిగా బీఆర్ఎస్ ఎదిగిందన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఎవ్వరికీ సాధ్యంకాని ఏకపక్ష విజయాలు సాధిస్తూ రికార్డులు తిరగరాసి… 21 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నామని, ఆటుపోట్లను తట్టుకొని మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతూ గమ్యాలను అందుకున్నామన్నారు.
బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆత్మీయ సందేశం.
BRS President and Chief Minister Sri KCR writes an open letter to the BRS party cadre. pic.twitter.com/vYeR5NQb46
— BRS Party (@BRSparty) March 20, 2023
”కష్టసుఖాలల్లో కలిసినడుస్తూ, ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ పల్లెల్లో గల్లీల్లో గులాబీ పతాకాన్ని రెపరెపలాడించి నాకు కొండంత అండగా నిలిచిన మీ రుణాన్ని ఎన్నడూ తీర్చుకోలేను. ఇతరులకు పాలిటిక్స్ అంటే గేమ్.. బీఆర్ఎస్‌కు మాత్రం టాస్క్. రాజకీయాన్ని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే పవిత్ర కర్తవ్యంగా భావించి కొత్తపంథాలో నడుస్తూ కోటి ఆశలతో ఏర్పడ్డ తెలంగాణను కోటి కాంతులు విరజిమ్మే నేలగా తీర్చిదిద్దుకున్నం. కష్టాలు, కన్నీళ్లు, కరువులతో అల్లాడిన తెలంగాణ ఇవాళ పచ్చని పంటలతో చిరునవ్వులతో కళకళలాడుతున్నది.” అని సీఎం కేసీఆర్ తెలిపారు.