ఈ నెల 18 నుంచి వర్షకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలతో కీలక భేటీ నిర్వహిస్తున్నారు. ప్రగతిభవన్ లో మధ్యాహ్నం 1 గంటలకు ఈ భేటీ ప్రారంభం అవుతుంది. పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, కేంద్రాన్ని నిలదీసే అంశాలపై ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్రం తెలంగాణ విషయంలో అనుసరిస్తున్న విధానాలు, రాష్ట్రానికి నష్టం చేసేలా చేస్తున్న చర్యలపై గట్టిగా ప్రశ్నించాలని కేసీఆర్ సూచించనున్నారు. ధాన్యం కొనుగోలు విషయాన్ని కూడా పార్లమెంట్ లో ప్రస్తావించాలని సీఎం కేసీఆర్ ఎంపీలకు సూచించనున్నారు.
మరోవైపు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ జాతీయ స్థాయి నేతలతో ఫోన్లో మంతనాలు జరిపారు. సీఎం కేసీఆర్ చేసిన సూచనలకు ఆయా జాతీయ పార్టీ నేతలు అంగీకారం కూడా తెలిపినట్లు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే సీఎం మమతా బెనర్జీ, కేజ్రీవాల్ తో పాటు సీఎం స్టాలిన్, తేజస్వీ యాదవ్, పవార్ తో సీఎం కేసీఆర్ సంభాషణలు జరిపిన విషయం తెలిసిందే.