తెలంగాణ పట్ల కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభల్లోనూ కేంద్రానికి వ్యతిరేకంగా గళం విప్పాలని టీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశమయ్యారు. లోకసభ, రాజ్యసభ ఎంపీలు ఈ భేటీకి హాజరయ్యారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయలేదని, బీజేపీ వైఖరిని ఎండగడుతూ.. పోరాటం చేసే పార్టీలతో కలిసి ముందుకు సాగాలని సీఎం కేసీఆర్ ఎంపీలను ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశం అన్ని రంగాల్లో వెనకబడిపోతోందని విమర్శించారు. ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళ్తున్న తెలంగాణకి మోదీ ప్రభుత్వం ఏనాడూ సహకరించలేదని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్ల కాలంలో ఒక్క రోజు కూడా, ఒక్క పైసా కూడా డిఫాల్ట్ కాకుండా తిరిగి చెల్లించిన ట్రాక్ రికార్డు తెలంగాణ సొంతమన్నారు. పాలనలో అప్రతిహతంగా ముందుకు సాగుతున్న తెలంగాణ మీద ప్రధాని మోడీకి కన్నుకుట్టిందని, నిబంధనల పేరుతో ఆర్ధికంగా తెలంగాణను అణచివేయాలని చూడటం అత్యంత శోచనీయమని సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో అన్నారు.