విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు వచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లి, సిన్హాకు స్వయంగా స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వున్నారు. అయితే.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైద్రాబాద్ లోనే జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా శనివారమే హైదరాబాద్ కు వస్తున్నారు. మోదీకి స్వాగతం పలకడానికి మాత్రం సీఎం కేసీఆర్ వెళ్లడం లేదు. ఈ ఆరు నెలల్లో ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా వుండటం ఇది మూడోసారి. సీఎం కేసీఆర్ కు బదులు, ప్రధానికి స్వాగతం పలకడానికి మంత్రి తలసాని ఎయిర్ పోర్టుకు వస్తున్నారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇక.. మోదీ టూర్ కు గైర్హాజర్ కావడం ఇది మూడో సారి. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) లో జరిగిన 20 వ వార్షిక వేడులకు హాజరయ్యేందుకు ప్రధాని హైదరాబాద్ కు వచ్చారు. అదే సమయంలో సీఎం కేసీఆర్ సరిగ్గా బెంగళూరుకు వెళ్లారు. అప్పుడు కూడా ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున తలసానే స్వాగతం పలికారు. అలాగే.. ఫిబ్రవరిలో సమతామూర్తి విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాని ముచ్చింతల్ కు వచ్చారు. అప్పుడు కూడా సీఎం కేసీఆర్ ప్రధానికి స్వాగతం పలకలేదు. కేసీఆర్ కు జ్వరం వచ్చిందని, అందుకే మోదీకి స్వాగతం పలికేందుకు రాలేదని సీఎంవోనే ప్రకటించింది. తాజాగా… ప్రధాని హైదరాబాద్ రానున్నారు. ఇప్పుడు కూడా సీఎం కేసీఆర్ మొహం చాటేస్తున్నారు.