దేశం క్లిష్ట సమయంలో వున్నప్పుడు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి, దేశాన్ని కాపాడిన వ్యక్తి పీవీ నరసింహారావు అని తెలంగాణ సీఎం కే. చంద్రశేఖర రావు అన్నారు. పీవీ ఆధునిక నిర్మాత అని కొనియాడారు. ప్రధానిగా పీవీ ప్రవేశపెట్టిన సంస్కరణలతో దేశం ఆర్థికంగానే కాకుండా.. అణుశక్తి, విదేశాంగ విధానం, అంతర్గత భద్రత వంటి రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించిందని అన్నారు. మాజీ ప్రధాని పీవీ జయంతిని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
దేశ ప్రధానిగా వున్న సమయంలో వినూత్న విధానాలతో దేశ సంపదను గణనీయంగా పెంచారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. తెలంగాణ నాయకత్వ దార్శనికత దేశానికి దిక్సూచిగా నిలుస్తుందనే విషయాన్ని పీవీ నిరూపించారని సీఎం తెలిపారు.