దాదాపు 9 నెలల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రాజ్ భవన్ గడప తొక్కారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ రాజ్ భవన్ వెళ్లారు. అటు సీఎం కేసీఆర్ కు, గవర్నర్ తమిళిసై మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో 9 నెలలుగా ఆయన రాజ్ భవన్ వైపు కూడా చూడలేదు. అక్టోబర్ 11, 2021 న అప్పటి సీజే సతీశ్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారానికి వెళ్లిన సీఎం.. ఆ తర్వాత రాజ్ భవన్ గడప తొక్కలేదు. మళ్లీ వెళ్లడం ఇవ్వాళే.
గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డి ఫైల్ ను గవర్నర్ తమిళిసై తిప్పి పంపినప్పటి నుంచి వివాదం ప్రారంభమైంది. ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని, తాను పర్యటనలకు వెళ్లినప్పుడు అధికారులెవ్వరూ హాజరు కావడం లేదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా తన తల్లి మరణిస్తే కూడా.. సీఎం కేసీఆర్ పలకరించలేదని కూడా గవర్నర్ వాపోయారు. గవర్నర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పలువురు మంత్రులు గవర్నర్ పై తీవ్రంగా విమర్శలు చేశారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు కూడా చేశారు. ఇక..
ఇవ్వాళ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ వెళ్లారు. గవర్నర్, సీఎం ఆప్యాయంగా పలకరించుకున్నారు. పుష్పగుచ్ఛాలతో పరస్పరం గౌరవించుకున్నారు. చిరు నవ్వులు కూడా చిందించారు. ప్రమాణ స్వీకారం తర్వాత జరిగిన తేనేటి విందులోనూ సీఎం, గవర్నర్ సరదాగా గడిపారు.