ఢిల్లీ వేదికగా జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. అది ప్రధాని భజన మండలిలా తయారైందని విమర్శించారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ శనివారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం దేశంలో ఇష్టారీతిగా వ్యవహరిస్తోందని, గతంలో ప్లానింగ్ కమిషన్ వల్ల దేశం డెవలప్ అయ్యిందని పేర్కొన్నారు. అలాంటి దానిని రద్దు చేసి నీతి ఆయోగ్ తెచ్చారని మండిపడ్డారు.
ప్రస్తుతం నీతి ఆయోగ్ నిరర్థక సంస్థగా మారిందని ఆరోపించారు. అప్పట్లో మంచి చెప్తే వినే ప్రధానులు వుండేవారని, ఇప్పుడు అలా లేరని మోదీపై విరుచుకుపడ్డారు. నీతి ఆయోగ్ వల్ల దేశంలో ఏలాంటి మార్పూ లేదన్నారు. మిషన్ కాకతీయకు రూ. 5వేల కోట్లు, మిషన్ భగీరథకు రూ. 19వేల కోట్లు మొత్తంగా రూ. 24వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించినా కేంద్రం 24 పైసలు కూడా ఇవ్వలేదని కేసీఆర్ విమర్శించారు. నిత్యావసరాల ధరల పెరుగుతున్నా, రూపాయి విలువ పాతాళానికి పడిపోతున్నా… నీతి ఆయోగ్ ఏం చేసిందని సూటిగా ప్రశ్నించారు.
విద్వేషాన్ని అసహనాన్ని పెంచుతున్న ఎన్డీఏ సర్కారు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. దేశ చరిత్రలోనే ఎప్పుడు లేనట్టుగా 13 నెలల పాటు రాజధానిలో ఆందోళన చేసి 800 మంది ప్రాణాలు కోల్పోతే.. ప్రధాని మోడీ క్షమాపణ చెప్పి చట్టాలు వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ప్రధాని మోదీ ఏ వాగ్దానం చేసినా.. నెరవేరడం లేదని, ఉపాధి హామీ కూలీలు కూడా రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. రాష్ట్రాల ప్రగతిని కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని మండిపడ్డారు. మూర్ఖులు తాము కూర్చున్న కొమ్మలను తామే నరుక్కుంటారని, కేంద్రం వైఖరి కూడా ఇదే విధంగా ఉందని కేసీఆర్ ధ్వజమెత్తారు.