భద్రాచలంలోని వరద ముంపు బాధిత కుటుంబాలకు సీఎం కేసీఆర్ పరిహారం ప్రకటించారు. వరద ముంపు బాధిత కుటుంబాలకు 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు వుంటాయని తెలిపారు. వరద ముంపుకు గురయ్యే ప్రాంత ప్రజలకు ఎత్తైన ప్రదేశంలో 1000 కోట్లతో కొత్త కాలనీలు నిర్మిస్తామని ప్రకటించారు. 7,274 కుటుంబాలను జిల్లా యంత్రాంగం పునరావాస కేంద్రాలకు తరలించిందని ప్రకటించారు. ప్రతి కుటుంబానికీ 20 కేజీల బియ్యం ప్రకటించారు.
ఇక.. ములుగు జిల్లాకు 2.50 కోట్లు, భద్రాచలం జిల్లాకు 2.30 కోట్లు, భూపాలపల్లి 2 కోట్లు, మహబూబాబాద్ కు 1.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. వర్షాలతో వరద ముప్పు తొలిగేపోయే వరకూ ములుగులో ఓ హెలికాప్టర్, భద్రాచలంలో ఓ హెలికాప్టర్ సిద్ధంగా వుంచుతామని సీఎం కేసీఆర్ తెలిపారు. విద్యుత్ సౌకర్యాన్ని తొందరగా పునరుద్ధరించాలని, ప్రజలకు ఇబ్బందులు కాకుండా చూసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.