తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అందుబాటులో వున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో వర్షాలు, వరదలపై చర్చించి, వివరాలు తీసుకున్నారు.
ఏయే జిల్లాల్లో వర్షపాతం ఎంత నమోదైంది? నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా వరద ఎంత వచ్చే ఛాన్స్ వుంది… అంటూ ఆరా తీశారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ గోదావరి తీర ప్రాంతంలోని మంత్రులు, ప్రజాప్రతినిధులతో స్వయంగా ఫోన్లో మాట్లాడారు. అక్కడి పరిస్థితులు, తీవ్రతను అంచనా వేశారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా వుండాలని, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.