స్వాతంత్ర్య పోరాట వీరుల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. సుదీర్ఘకాలం అనేక సంక్షోభాల్లో తెలంగాణ చిక్కి కొట్టుమిట్టాడిందని, ఈ ఎనిమిదేండ్లలోనే కోలుకుని కడుపు నిండా తింటూ.. కంటినిండా నిద్రపోతున్నదని అన్నారు. ‘‘ఇంటింటా నల్లాలతో స్వచ్ఛమైన తాగునీటిని అన్ని గ్రామాలకు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. గొర్రెల పెంపకంలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిన రాష్ట్రం తెలంగాణ. వృద్ధిరేటులో ప్రథమ స్థానంలో నిలిచిందని వివరించారు. సోమవారం గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు.ఇప్పటికే 1.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. 91,142 ఉద్యోగాలు ఒకేసారి భర్తీ చేసుకుంటున్నామని తెలిపారు. ఎనిమిదేండ్లలో రూ. 2.32 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. పరిశ్రమలు, ఐటీ సెక్టార్లో 16.50 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. 1500కు పైగా చిన్న, పెద్ద ఐటీ పరిశ్రమలు హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. దళితబంధు పథకం దేశానికి దిశా నిర్దేశం చేస్తున్నదని వివరించారు.
సహకార సమాఖ్య స్ఫూర్తి అంటూ ఆదర్శాలు వల్లించే కేంద్ర ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం అధికారాల కేంద్రీకరణకు పాల్పడుతోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. భారతదేశం రాష్ట్రాల సమాహారం అని పేర్కొన్న రాజ్యాంగం తొలి అధికరణాన్నే కేంద్రం అపహాస్యం చేస్తోందన్నారు. ఉమ్మడి జాబితాలోని అంశాలపై రాష్ట్రాలను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకొని.. తమపై రుద్దుతోందని విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలనూ ఇలాగే రుద్దే ప్రయత్నం చేస్తే.. దేశ రైతాంగం తిరగబడిందని, దీంతో కేంద్రం తోక ముడిచిందని ఎద్దేవా చేశారు. దేశంలోని 28 రాష్ర్టాల్లో 22 రాష్ర్టాలు తెలంగాణ కన్నా ఎక్కువ అప్పులు తీసుకున్నాయని తెలిపారు.
ఇది తెలంగాణ సంక్షేమంలో స్వర్ణ యుగమని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. ఈ పంద్రాగస్టు నుంచే మరో 10 లక్షల మందికి పింఛన్లను అందిస్తున్నామని వివరించారు. దళితుల అభ్యున్నతి కోసం విప్లవాత్మకంగా దళితబంధు పథకాన్ని తెచ్చి రూ.10 లక్షలను గ్రాంటుగా అందిస్తున్నామని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటైన 2,616 వైన్‌షాపుల్లో 261 దుకాణాలను దళితులకే కేటాయించాం. గొల్లకుర్మల సంక్షేమం కోసం గొర్రెల పంపిణీ చేపట్టాం. వేల కోట్ల విలువైన మత్స్య సంపదను సృష్టించాం. నేతన్నకు బీమా అమలు చేస్తున్నాం. ఆరేళ్లలో 1.34 కోట్ల ఎకరాల నుంచి 2.15 కోట్ల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెంచాం. రూ.57,880 కోట్లను రైతు బంధు అందించామని సీఎం కేసీఆర్ వివరించారు.