Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

సామూహిక జాతీయ గీతాలాపన తెలంగాణకే గర్వ కారణం : సీఎం కేసీఆర్

తెలంగాణలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ముగింపు ఉత్సవాలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్నాంజలి ఘటించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రతి ఇంట్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తి రగిలేలా రోజుకో కార్యక్రమం చేపట్టామని, కోటి మందితో సామూహిక జాతీయ గీతాలాపన చేయడం తెలంగాణకే గర్వకారణమని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ఎవ్వరూ మరిచిపోవద్దని కోరారు. స్వాతంత్రం ఊరికే లభించలేదని, కులం, మతం, జాతి అనే భేదం లేకుండా… అందరూ కలిసి దేశం కోసం పోరాడారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కరోనా లాంటి మహమ్మారి వస్తూ, పోతుంటుందని, స్వాతంత్ర ఉజ్వలత్వం, 75 ఏళ్లుగా దేశంలో జరుగుతున్న విషయాలను గుర్తు చేసుకుంటూ ముందుకు సాగాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్త‌యిన‌ప్ప‌టికీ.. పేద‌ల ఆశ‌లు నెర‌వేర‌లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక వ‌ర్గాల ప్ర‌జ‌లు త‌మ‌కు స్వ‌తంత్ర‌ ఫ‌లాలు సంపూర్ణంగా అంద‌ట్లేద‌నే ఆవేద‌న మ‌న‌కు క‌న‌బ‌డుతుంద‌ని అన్నారు. వాట‌న్నింటిని విస్మ‌రించి ఈ దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టివేసేందుకు కుటిల ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌డాన్ని మ‌నమంతా చూస్తున్నామని పేర్కొన్నారు. మౌనం వ‌హించ‌డం స‌రికాదని, అర్థమైన త‌ర్వాత కూడా అర్థం కాన‌ట్టు ప్ర‌వ‌ర్తించ‌డం మేధావుల ల‌క్ష‌ణం కాదని సీఎం అన్నారు. మేధావులు సమాజంలో జరుగుతున్న తప్పొప్పులను సరిచేయాలని అన్నారు.

స్వ‌తంత్ర భార‌త స్ఫూర్తిని ఈ త‌రం పిల్ల‌ల‌కు, యువ‌కుల‌కు తెలియ‌ని వారికి విస్తృతంగా తెలియ‌ప‌ర‌చాల‌నే ఉద్దేశంతో ఈ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని సీఎం కేసీఆర్ వివరించారు. ప్రాణ‌, ఆస్తి త్యాగాలు, అమూల్య‌మైన జీవితాలు త్యాగం చేస్తే, ఎన్నో బ‌లిదానాలు చేస్తే ఈ స్వాతంత్య్రం వ‌చ్చిందని, స్వేచ్ఛా భార‌తంలో స్వేఛ్చా వాయువులు పీలుస్తున్నాం. 75 ఏండ్లుగా జ‌రుగుతున్న విష‌యాల‌ను మ‌రోసారి సింహ‌వ‌లోక‌నం చేసుకోని ముందుకు పురోగ‌మించాల్సిన‌టువంటి ప‌ద్ధతులను ఆలోచించుకోవాల్సిన అవ‌స‌రం అంద‌రికీ ఉందని సీఎం నొక్కి వక్కాణించారు. స్వ‌తంత్ర దేశంగా మార్చేందుకు ఎంద‌రో మ‌హ‌నీయులు త్యాగాలు చేశారని, వారంద‌రికీ శిర‌సు వంచి విన‌మ్ర‌పూర్వ‌కంగా జోహార్లు అర్పిస్తున్నానని సీఎం తెలిపారు.

Related Posts

Latest News Updates