బీజేపీని గద్దె దించేందుకు క్రియాశీల, ప్రగతిశీల శక్తులన్నీ ఏకం కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. 8 ఏండ్లలో బీజేపీ ఒక్క మంచి పనైనా చేసిందా అని కేసీఆర్ ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కేంద్రం ఎందుకు తేల్చడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం జరగనున్న బీజేపీ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మునుగోడులో నిర్వహించిన ప్రజా దీవెన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. మునుగోడులో బీజేపీకి ఎప్పుడూ డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవాచేశారు. మునుగోడు ఉప ఎన్నిక రాజకీయ పార్టీల ఎన్నిక కాదని, రైతుల బతుకుదెరువు ఎన్నిక అని అభివర్ణించారు. ఈసారి బీజేపీకి ఓటు పడిందంటే.. బావి కాడ మీటర్లు ఉన్నట్టేనని హెచ్చరించారు. ప్రజల మద్దతుతోనే తాను మీటర్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నానని తెలిపారు. మీటర్లు పెట్టే మోడీ కావాలో లేక మీటర్లు వద్దనే కేసీఆర్ కావాలో ప్రజలే తేల్చుకోవాలని అన్నారు.
ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే బీజేపీతో పోరాడుతున్నానని, తాను బలహీనపడితే మోడీపై ఎట్లా కొట్లాడాలని ప్రశ్నించారు. పోరాటం అనేది తెలంగాణకు కొత్త కాదని స్పష్టం చేశారు. యాడ తెలంగాణ కోసం ఎక్కడి వరకైనా కొట్లాడేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. ఎన్నికలు రాగానే గందరగోళానికి గురికావొద్దని, ఎవరి సంక్షేమం కోసం ఉప ఎన్నిక వచ్చిందన్న విషయాన్ని జనం గ్రహించాలని సీఎం కేసీఆర్ అన్నారు.
ఒకప్పుడు నల్లగొండ ఫ్లోరైడ్ నీళ్లతో బాధపడేదని, ఈ విషయం అందరికీ తెలుసని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రమంతా తిరిగి, నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య గురించి వివరించానని, 15 రోజుల పాటు జిల్లా అంతా కూడా తిరిగానని, ఫ్లోరైడ్ కష్టాలపై అవగాహన కల్పించామని అన్నారు. అనేక పోరాటాల తర్వాత తెలంగాణ సాధించుకున్నామని, ఈ రోజు జీరో ఫ్లోరైడ్ నల్లగొండగా మనం మార్చుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందిస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.