తెలంగాణలో సంస్కారవంతమైన పోలీస్ వ్యవస్థ నిర్మితమై, దేశ పోలీస్ వ్యవస్థకే తెలంగాణ పోలీస్ ఓ కలికితురాయి కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. చిత్తశుద్ధి, సంకల్ప బలం వుంటే అనుకున్నది సాధిస్తామని, అందుకు పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణమే నిదర్శనమని ఉదహరించారు. హైదరాబాద్‌లో ఇంతగొప్ప కమాండ్ కంట్రోల్ రూం వస్తుందని ఎవరూ భావించలేదని, కానీ సంకల్పంతో సాధించామని చెప్పారు. హైదరాబాద్ లో 600 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం గురువారం ప్రారంభించారు. కమాండ్ కంట్రోల్ సహాయంతో రాష్ట్ర పోలీస్ శాఖ అద్భుతమైన ఫలితాలు సాధించాలని, తద్వారా ప్రజలకు గొప్ప సేవలు అందించాలని ఆకాంక్షించారు. కమాండ్ కం ట్రోల్ సాయంతో పోలీస్‌శాఖ అద్భుత ఫలితాలు సాధించాలి. ప్రజలకు గొప్ప సేవలు అందించాలి. సంస్కారవంతమైన పోలీస్‌గా తయారు కావాలని సూచించారు.
సీసీసీను ఇంత అద్భుతంగా నిర్మించిన నిర్మాణ సంస్థలు షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్‌అండ్‌టీకి, రోడ్లు భవనాల శాఖకు రాష్ట్ర ప్రజానీకం తరఫున, పోలీస్‌శాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సెంటర్ పోలీసు శాఖకు మూలస్తంభంగా నిలవడమే కాక.. పరిపాలనకూ అద్భుతంగా ఉపయోగపడుతుందని ఆయన కొనియాడారు.తెలంగాణను నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది దేశానికే ఆదర్శంగా నిలవాలని పోలీసులకు పిలుపునిచ్చారు. నేరగాళ్లు కొత్తకొత్త సాంకేతిక పరిజ్ఞానాలతో మోసాలు చేస్తున్నారని.. వారిని నిలువరించేందుకు ప్రతి పోలీసూ అప్‌గ్రేడ్ కావాలని సూచించారు.
అన్ని అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాతే ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సెంటర్ సాధారణ సమయంలో ఒకలాగా ఉపయోగపడుతుందని.. విపత్తులు సంభవించినప్పుడు ఎమర్జెన్సీ సెంటర్‌లాగా ఉపయోగించుకోవచ్చని వెల్లడించారు. నిజానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం రెండేళ్ల క్రితమే పూర్తికావాల్సిందని.. కానీ కరోనా, ఇతర ఆటంకాల వల్ల కొంత ఆలస్యం జరిగిందని చెప్పారు.హైదరాబాద్‌లో ఇంత మంచి కమాండ్ కంట్రోల్ సెంటర్ వస్తుందని ఎవరు ఊహించలేదు. ప్రపంచస్థాయిలో తెలంగాణ పోలీస్‌కు మంచి గుర్తింపు ఉంది. నేరాల నియంత్రణ, శిక్షల్లో మన పోలీసులు సత్తా కనబరుస్తున్నారు. వారికి అవసరమైన పూర్తి సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.
గత 8 సంవత్సరాలుగా తెలంగాణ రాష్టం ప్రశాంతంగా వుందని, శాంతిభద్రతల నిలయంగా ముందుకు తీసుకెళ్తున్నామని సీఎం కేసీఆర్ వివరించారు. గొడవలు ప్రస్తుతం జరగడం లేదని, భవిష్యత్తులో కూడా జరగొద్దు.. జరగవని ఆశిద్దామని అన్నారు. అద్భుతమైన ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చిందని, ఇక నుం చి నేరాలపై మరింత నియంత్రణ పెరిగే అవకాశం ఉన్నదని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.