మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అంతాయిపల్లిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. సర్వమత ప్రార్థనల అనంతరం కలెక్టర్ హరీష్ను కుర్చీలో సీఎం కేసీఆర్ కూర్చొబెట్టి.. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవంలో మంత్రులు మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. దేశంలో కులం, మతం పేరుతో విడదీసే ప్రయత్నం చేస్తున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. కులం, మతం లేనటుంవంటి ఐక్యత సమాజంలో రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని పునరుద్ఘాటించారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 గంటలు కూడా కరెంట్ ఉండేది కాదని, కానీ ఇప్పుడు 24 గంటల పాటు కరెంట్ వస్తుందని అన్నారు. హైదరాబాద్ లోని బస్తీలోనూ 24 గంటల పాటు విద్యుత్ ఉంటుందన్నారు. హైదరాబాద్ లో 24 గంటలూ కరెంట్ పోదు…ఢిల్లీలో 24 గంటల పాటు కరెంట్ ఉండదని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని దెప్పి పొడిచారు.
రాష్ట్రంలో ఇప్పటికే 36 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మరో 10 లక్షల మందికి అదనంగా ఇవ్వబోతున్నట్లు చెప్పారు. మొత్తంగా 46లక్షల మందికి పింఛన్ అందిస్తున్నామన్నారు.తెలంగాణ ముమ్మాటికి ధనిక రాష్ట్రమని సీఎం కేసీఆర్ అన్నారు. కొందరు చేసే ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. 2014లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. లక్ష ఉంటే..ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2,78,500 అని చెప్పారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ ఇని చెప్పారు. మహారాష్ట్ర, గుజరాత్ లాంటి పెద్ద రాష్ట్రాలు మనకంటే వెనుకబడి ఉన్నాయన్నారు. పరిపాలన వికేంద్రీకరణతో ప్రజలకు వేగంగా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లా అవుతుందని ఏనాడూ కల కనలేదని.. రాష్ట్రం ఏర్పడడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. పరిపాలన ప్రజలకు ఎంత దగ్గరకు వస్తే అంత చక్కగా పనులు జరిగే అవకాశం ఉంటుందన్నారు.