వికారాబాద్ సమీక్రుత కలెక్టరేట్ ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రారంభించారు. 61 కోట్లతో ఈ సమీక్రుత కలెక్టరేట్ ను ప్రారంభించారు. ఆ తర్వాత వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వికారబాద్ లో నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఉద్యమం సమయంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు రంగారెడ్డి జిల్లా కార్యాలయాలు వికారాబాద్ లో పెట్టాలని కోరేవారని గుర్తు చేశారు. రాష్ట్రం రాగానే వికారబాద్ ను జిల్లా చేసుకుందామని చెప్పామని, ఇచ్చిన హామీ ప్రకారం వికారాబాద్ ను జిల్లాగా చేసుకున్నామని, మంచి భవనాలు కూడా నిర్మించుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాకముందు, రాష్ట్రంలో పరిస్థితి ఎలా వుండేది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా వుందో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ రాకుంటే… వికారాబాద్ జిల్లా అయ్యేదా? వైద్య కళాశాల వచ్చేదా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడితే… భూముల ధరలు పడిపోతాయని తప్పుడు ప్రచారాలు చేశారని, కానీ… ఏపీ, కర్నాటకలో కంటే తెలంగాణలోనే భూములు రేట్లు పెరిగాయని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ముందుకు దూసుకుపోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తుందని, బంగారు తెలంగాణ దిశగా ముందుకు సాగుతోందన్నారుచావు అంచుదాకా వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. సిద్ధించిన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అయితే రాష్ట్రం బాగుంటేనే సరిపోదని, దేశం కూడా బాగుండాలని హితవు పలికారు. గతంలో రైతులు చనిపోతే.. ఆపద్బంధు కింద 50 వేలే ఇచ్చేవారని, కానీ.. ఇప్పుడు గుంట భూమి వున్న రైతు చనిపోయినా…. 10 రోజుల్లోపే 5 లక్షల రైతు బీమా సొమ్మును ఇస్తున్నామని పేర్కొన్నారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి తాగునీరు అందించామని, రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని కేసీఆర్ అన్నారు.