Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ప్రతి యేటా అంబేద్కర్ పేరుతో ప్రతిష్ఠాత్మక అవార్డు : సీఎం కేసీఆర్ ప్రకటన

హైదరాబాద్ లోని ట్యాంక్బండ్ వద్ద బీఆర్ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మునిమనుమడు ప్రకాష్ అంబేద్కర్ హాజరయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బౌద్ధ భిక్షువులు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా అంబేద్క‌ర్ విగ్ర‌హంపై హెలికాప్ట‌ర్ ద్వారా గులాబీ పూల వ‌ర్షం కురిపించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఇకపై ప్రతి యేటా అంబేద్కర్ పేరిట అవార్డులు ఇస్తామని ప్రకటించారు. దీని కోసం ప్రత్యేకంగా 51 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామని, దానిపై ఏటా 3 కోట్ల వరకూ వడ్డీ వస్తుందని వివరించారు. యేటా అంబేద్కర్ జయంతి రోజున ఉత్తమ సేవలందించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అవార్డు ప్రదానం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

అంబేద్కర్ విశ్వమానవుడు అని అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా అణగారిన వర్గాలకు ఆశాదీపం అని అన్నారు. అణగారిన వర్గాల ఆశాదీపం అంబేడ్కర్‌ అని, సెక్రెటేరియట్ కు వచ్చే అధికారులు, మంత్రులకు అంబేద్కర్ విగ్రహాన్ని చూడగానే… ఆయన ఆశయ సాధనలు గుర్తుకు వచ్చేలా విగ్రహం వుందన్నారు. ప్రతియేడాది ఘనంగా అంబేద్కర్ జయంతిని జరుపుకుంటామని, కానీ… ఆయన ఆశయాలను సాధించుటలో ఎంత దూరం ప్రయాణించామో… ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.

అణగారిన వర్గాల ఆశాదీపం అంబేడ్కర్‌ అని, ఎవరో అడిగితే అంబేడ్కర్‌ విగ్రహం పెట్టలేదని, విశ్వమానవుడి విశ్వరూపం ప్రతిష్టించుకున్నామన్నారు. అంబేడ్కర్‌ సిద్ధాంతాలు గుర్తుకొచ్చేలా ఏర్పాట్లు చేశామని, తెలంగాణ కలలు సాకారం చేసుకునే చిహ్నం ఈ విగ్రహమని సీఎం చెప్పారు. ఇది విగ్రహం కాదు.. ఒక విప్లవమని అభివర్ణించారు. స్వాతంత్ర్యం తర్వాత కూడా పేదరికంలోనే దళితులు ఉన్నారని, దళితుల అభ్యున్నతిని గత పాలకులు పట్టించుకోలేదని, BRS సర్కార్‌ వచ్చాక దళితుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని కేసీఆర్ వెల్లడించారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటులో ఓ బలమైన సందేశం వుందని, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టామన్నారు.

Related Posts

Latest News Updates