ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కొండగట్టు హనుమంతుడి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అధికారులతో ఆలయ అభివృద్ధిపై రెండు గంటలకుపైగా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశం అనంతరం మాట్లాడుతూ.. కొండగట్టు ఆలయ అభివృద్ధికి మరో రూ.500 కోట్ల నిధులను కేటాయించనున్నట్లు సీఎం ప్రకటించారు. ఆలయం పరిసరాల్లో 86 ఎకరాల స్థలంలో సువిశాల పార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఇప్పటికే 100 కోట్లను ప్రకటించారు. ప్రపంచాన్నే ఆకర్షించేలా అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని అన్నారు. దేశంలో అతిపెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడుందంటే కొండగట్టు పేరే చెప్పుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు.
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి ఒక బృహత్తర ప్రాజెక్టని, భక్తులకు సకల వసతులు, అన్ని హంగులతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సీఎం చెప్పారు. కొండగట్టులో ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఘాట్ రోడ్డులను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. హనుమాన్ జయంతిని దేశంలోనే అత్యంత గొప్పగా కొండగట్టులో జరుపుకోవాలన్నారు.
ఆలయ అభివృద్ధి ఓ బృహత్తర ప్రాజెక్ట్ అన్న కేసీఆర్.. అన్ని హంగులతో తీర్చిదిద్దడంతో పాటు, భక్తులకు సకల వసతులు కల్పించేలా కొండగట్టు క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. వేల మంది ఒకేసారి హనుమాన్ దీక్ష ధారణ, విరమణ చేస్తుంటారని, అలాంటి సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. హనుమాన్ దీక్ష దివ్యంగా, గొప్పగా జరిగేలా కృషిచేయాలని సూచించారు. సుమారు 850 ఎకరాల్లో ఆలయ అభివృద్ధి , విస్తరణ పనులు చేయాలని, పెద్ద గోడ, పార్కింగ్, పుష్కరిణి, అన్నదాన సత్రం, కళ్యాణ కట్ట, కోనేరును అభివృద్ధిపర్చాలన్నారు.