రాష్ట్రపతి అభ్యర్థుల ఎన్నికల విషయంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒక్కసారిగా మాట మార్చేశారు. ప్రతిపక్షాలను కూడగట్టి, ఎలాగైనా బీజేపీ అభ్యర్థిని ఓడించాలని ఢిల్లీ వేదికగా సమావేశాలు నిర్వహించడం, బీజేపీపై విమర్శలు చేయడం తెలిసిందే. తాజాగా.. రాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపుకే ఎక్కువ అవకాశాలున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముర్మూకు మద్దతిచ్చే విషయంలో ప్రతిపక్షాలు ఒకసారి ఆలోచించాలని సూచించారు. ముర్మును బరిలోకి దింపే ముందు ఎన్డీయే ఓసారి విపక్ష నేతలతో సంప్రదించి వుంటే బాగుండేదని అన్నారు. అందరి ఏకాభిప్రాయంతో ఎన్నికయ్యే వ్యక్తే దేశ రాష్ట్రపతిగా వుంటే బాగుండేదని మమత పేర్కొన్నారు.
మహారాష్ట్ర పరిస్థితులు చూసిన తర్వాత ముర్ముకే అవకాశాలున్నట్లు కనిపిస్తోందని అన్నారు. ముర్మూ పేరును ప్రకటించే ముందు తమ సలహాలను అడిగితే.. మేం కూడా పరిశీలించే వారం అంటూ మమత కీలక వ్యాఖ్యలు చేశారు.