టీచర్ల నియామకాల్లో తీవ్ర అవినీతికి పాల్పడిన మంత్రి పార్థా ఛటర్జీని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేబినెట్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు కేటాయించిన ఐటీ, పరిశ్రమలతో పాటు ఇతర శాఖలను తానే స్వయంగా చూసుకుంటానని మమత ప్రకటించారు. ఇక… టీఎంసీ నుంచి కూడా పార్థా ఛటర్జీని సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ప్రకటించారు. దర్యాప్తులో ఆయన నిర్దోషి అని గనక తేలితే… ఆయన్ను తిరిగి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తామని ప్రకటించారు.
బెంగాల్ లో స్కూల్ సర్వీస్ కమిషన్ చేపట్టిన నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ మంత్రి పార్థా ఛటర్జీని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనితో పాటు ఆయనకు అత్యంత సన్నిహితంగా వుండే అర్పితా ముఖర్జీతో సహా పలువురు ఇళ్లల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా 30 కోట్ల నగదు, 5 కేజీల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అర్పితా ముఖర్జీ ఇంట్లో 20 వేల సొమ్మును కూడా మొదటి దశలో ఈడీ కనుక్కొంది. కానీ తర్వాత జరిగిన సోదాల్లో కూడా ఈడీ మరింత డబ్బును స్వాధీనం చేసుకుంది. అర్పితా ముఖర్జీ ఇంటి నుంచి ఈడీ మొత్తం 50 కోట్ల సోమ్మును స్వాధీనం చేసుకుంది.