తెలంగాణలోనూ కమల వికాసం వుంటుందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగుతున్న నిరంకుశ పాలనకు ముగింపు పలకాలని తెలంగాణ ప్రజానికి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన విజయ సంకల్ప సభలో యోగి ప్రసంగించారు. యూపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ సుపరిపాలన సాగుతోందన్నారు.
యూపీ ప్రజలందరికీ కేంద్ర పథకాలు సులభంగా అందుతున్నాయని చెప్పారు. యూపీలో 6 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల హెల్త్ కవరేజీ అందించడంతో పాటు కరోనా కారణంగా 15 కోట్ల మందికి నెలకు రెండు సార్లు ఉచిత రేషన్ కూడా అందిస్తున్నామని వివరించారు.
తెలంగాణలో బీజేపీ నేతలు, కార్యకర్తలు తెగ ఉత్సాహంతో వున్నారని అదే తమకు స్ఫూర్తి అని సీఎం యోగి అన్నారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతోందన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం వేగంగా జరుగుతోందని, సబ్ కా సాథ్… సబ్ కా వికాస్ అన్న నినాదంతో యూపీలో ముందుకు సాగుతున్నామని సీఎం యోగి వివరించారు.