ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను 5 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ… సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు సీబీఐ కోరిన విజ్ఖప్తికి కోర్టు ఓకే చెప్పింది. దీంతో మార్చి 4 వరకూ సిసోడియాను కస్టడీలోకి తీసుకోవడానికి సీబీఐకి అనుమతిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే.. మొదట్లో సీబీఐ కస్టడీకి ఇచ్చే విషయంలో తీర్పును రిజర్వ్ చేసింది. కొద్దిసేపటికే మళ్లీ కోర్టు తీర్పు వెలువరించింది.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టైన ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను సీబీఐ సోమవారం నాడు కోర్టులో హాజరుపరిచింది. సిసోడియా తాము అడిగిన ప్రశ్నలను పూర్తిగా దాటేస్తున్నారని, సరిగ్గా సమాధానాలు ఇవ్వడం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగాలంటే… ఆయనను 5 రోజుల కస్టడీకి అప్పగించాలని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది. అయితే… సీబీఐ కస్టడీ పిటిషన్పై తీర్పును రౌస్ ఎవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు సిసోడియా తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ దయాన్ కృష్ణన్ సీబీఐ కస్టడీ పిటిషన్ను వ్యతిరేకించారు.తన క్లయింట్ విచారణకు సహకరిస్తున్నందున సీబీఐ కస్టడీ అవసరంలేదని చెప్పారు. అయితే… ఈ కేసులో సీబీఐ డిప్యూటీ సీఎం సిసోడియాను నెంబర్ 1 నిందితుడిగా పేర్కొంది.