గోవాలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురు అక్రమంగా బార్ నిర్వహిస్తోందని కాంగ్రెస్ నేతలు కొద్ది రోజుల క్రితం ఆరోపణలు చేశారు. తాజాగా ఆ కేసులో స్మృతి ఇరానీ కూతురికి భారీ ఊరట లభించింది. అసలు గోవాలోని రెస్టారెంట్‌కు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఆమె కుమార్తె జోయిష్ ఓనర్లు కాదని స్పష్టం చేసింది ఢిల్లీ హైకోర్టు. వారికి అసలు లైసెన్సులే జారీ కాలేదని పేర్కొంది. వారు ఎన్నడూ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోలేదని స్పష్టం చేసింది. రెస్టారెంట్, ఆ భూమి కూడా స్మృతి ఇరానీ, ఆమె కుమార్తెకు చెందినది కాదని తెలిపింది. కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, పవన్ ఖేరా, నెట్టా డీసౌజాలు ఆరోపణలు చేసిన క్రమంలో వారిపై రూ.2 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. కేంద్ర మంత్రి. ఆ కేసు విచారణ సందర్భంగా ఈ మేరకు స్పష్టం చేసింది ఢిల్లీ హైకోర్టు.
