నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తొలిరోజు విచారణ ముగిసింది. గురువారం ఉదయం సోనియా గాంధీ విచారణ నిమిత్తం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. మొత్తం 3 గంటల పాటు ఈడీ సోనియాను విచారించింది. అడిషనల్ డైరెక్టర్ హోదా కలిగిన మహిళా అధికారి సారథ్యంలో ఐదుగురు అధికారులు సోనియా గాంధీని ప్రశ్నించారు. మొత్తం 3 సిట్టింగులు, 25కి పైగా ప్రశ్నలు అడిగినట్లు వార్తలొస్తున్నాయి. అయితే రెండో సారి విచారణ నిమిత్తం ఈ నెల 25 న మళ్లీ విచారణకు హాజరు కావాలని సోనియాకు ఈడీ అధికారులు సూచించారు.
విచారణ కొనసాగే సమయంలో సోనియా కూతురు, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పక్క గదిలోనే వున్నారు. సోనియాకి ఆరోగ్యం బాగో లేకపోవడం వల్ల అలా వుండేందుకు ఈడీ ఆమెకు పర్మిషన్ ఇచ్చింది. రాహుల్ మాత్రం ఈడీ ఆఫీసు నుంచి వెళ్లిపోయారు. ఇక… సోనియాని ఈడీ విచారిస్తున్న సమయంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అగ్రనేతలైన చిదంబరం, అజయ్ మాకెన్, అధీర్ రంజన్ హరీశ్ రావత్, థరూర్ లాంటి సీనియర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పలు రాష్ట్రాల్లో కూడా పీసీసీల ఆధ్వర్యంలో నిరసనలను చేపట్టారు.