నేషనల్ హెరాల్డ్ కు సంబంధించి 90 కోట్ల మనీలాండరింగ్ కేసు విషయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం మరోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. సోనియా వెంట పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ, సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ కూడా వచ్చారు. ఈ సందర్భంగా ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేషనల్ హెరాల్డ్ 90 కోట్ల మనీలాండరింగ్ విషయంలో సోనియాను ఈడీ ప్రశ్నించడం ఇది రెండో సారి. నాలుగు రోజుల క్రిందటే ఇదే విషయంపై సోనియా మొదటి సారిగా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ పూర్తికాకపోవడంతో మళ్లీ 26 న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీ మళ్లీ నేడు ఈడీ విచారణకు హాజరయ్యారు.
ఇక… సోనియా గాంధీ ఈడీ విచారణ హజరయ్యే విషయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. కాంగ్రెస్ పై కేంద్రం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని నేతలు మండిపడుతున్నారు. మరోవైపు ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. అయితే పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పార్టీ ప్రధాన కార్యాలయానికి రావాలని కీలక నేతలు పిలుపునిచ్చారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు పార్టీ కార్యాలయానికి తరలి వస్తున్నాయి. తమ పార్టీ నేతలను కేంద్ర ప్రభుత్వం హింసిస్తోందని కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మండిపడ్డారు. తామంతా గాంధీ కుటుంబంతోనే వున్నామన్నారు.