కాంగ్రెస్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఇన్ని రోజులుగా కాస్త అటు ఇటుగా వున్నా… ఇప్పుడు మాత్రం క్లియర్ కట్ తో బీజేపీలో చేరుతున్నారు. ఇదే విషయంపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ తరుణ్ ఛుగ్ తో 45 నిమిషాల పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాతే బీజేపీలో చేరేందుకు కొండా నిశ్చయించుకున్నారు. అంతేకాకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా కొండా ఫోన్లో సంభాషించారు.
మంచి ముహూర్తం చూసుకొని, బీజేపీ చేరేందుకు కొండా రెడీ అయ్యారు. అయితే… వచ్చే నెల 2,3 తేదీల్లో హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ప్రధాని మోదీతో సహా ఆ పార్టీ అగ్రనేతలు, సీఎంలు అందరూ పాల్గొంటున్నారు. ఈ సమావేశాల సందర్భంగా బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. దీనికి ప్రధాని మోదీ హాజరవుతున్నారు. ఈ సభలోనే కొండా జాయిన్ అవుతారా? లేదా మరో సమావేశం వేదికగా జాయిన్ అవుతారా? అన్న దానిపై స్పష్టత రావాల్సి వుంది.