పుల్వామా, సర్జికల్ స్ట్రైక్స్ పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దిగ్విజయ్ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదని, అవి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలని రాహుల్ ప్రకటించారు. పుల్వామా, సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో భారత జవాన్లు అద్భుతమైన ధైర్య సాహసాలతో తమ విధులను నిర్వర్తించారని, సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా విషయంలో ఎలాంటి ఆధారాలు చూపించాల్సిన అవసరం లేనే లేదన్నారు. భారత్ జోడో యాత్రలో విలేకరుల సమావేశంలో రాహుల్ పై వ్యాఖ్యలు చేశారు. తాను నిన్ననే కశ్మీరీ పండిట్ల ప్రతినిధులతో భేటీ అయ్యానని, తమని రాజకీయాల కోసం వాడుకుంటున్నారని వాపోయినట్లు పేర్కొన్నారు. కశ్మీరీ పండిట్ల సమస్యలను పార్లమెంట్ లో ప్రస్తావించాలని తనను కోరారని వెల్లడించారు.
భారత్ జోడో యాత్ర సందర్భంగా దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా దాడులకు సంబంధించిన నివేదికలను కేంద్రం ఇప్పటి వరకూ పార్లమెంట్ లో ప్రవేశపెట్టలేదని విమర్శించారు. ఎందుకు ప్రవేశపెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సర్జికల్ దాడులకు సంబంధించి ఇప్పటి వరకూ ఒక్క ఆధారం కూడా ప్రభుత్వం చూపించలేదని విమర్శించారు. పుల్వామా లో పాక్ కి చెందిన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ జరిపిన దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీర మరణం పొందారని, దీనిపై నివేదికలు సమర్పించలేదన్నారు.
సర్జికల్ దాడుల్లో ఎంత మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని కేంద్రం చెబుతున్నా… దానికి సంబంధించిన ఆధారాలను కూడా చూపించడం లేదని దిగ్విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండగా కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో సీనియర్ నేత జైరామ్ రమేశ్ అడ్డుకున్నారు. పుల్వామా దాడులపై దిగ్విజయ్‌సింగ్‌తో క్లారిటీ తీసుకుంటున్న సమయంలో మాట్లాడేదేమీ లేదంటూ విలేకరిని జైరామ్ రమేశ్ అడ్డుకున్నారు. చెప్పాల్సిందేమీలేదంటూ వేగంగా దూసుకొచ్చి మైకును దూరం జరిపారు.