రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సంబోధించే విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున్నారు కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరీ. దీంతో ఉభయ సభల్లోనూ, బయట కూడా దుమ్ము దుమారం రేగుతోంది. అధీర్ రంజన్, సోనియా, కాంగ్రెస్ వెంటనే ముర్ముకు క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రులు, బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఓ ఆదివాసీ మహిళ దేశ అత్యున్నత పదవిని అలంకరించడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని దుయ్యబడుతున్నారు. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలు చేస్తున్నారని స్మృతి ఇరానీతో సహా పలువురు కేంద్ర మంత్రులు మండిపడ్డారు.
ఇంతకీ అధీర్ రంజన్ ఏమన్నారంటే…
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాను ఈడీ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ ని విలేకరులు పలు ప్రశ్నలడిగారు. మేము రాష్ట్రపతిని కలవడానికి వెళ్తున్నాము. కాదు కాదు.. రాష్ట్రపత్ని.. అందరికీ అంటూ వ్యాఖ్యానించారు. తర్వాత నాలుక కరుచుకుంటూ… ఉద్దేశపూర్వకంగా తాను అనలేదని, నోరుజారానని వివరణ ఇచ్చుకున్నారు.
అధీర్ చేసిన ఈ వ్యాఖ్యలతోనే పార్లమెంట్ వేదికగా దుమ్ము దుమారం రేగింది. అటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా వాగ్యుద్ధం జరిగింది. అధీర్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ మహిళా ఎంపీలు నిరసన చేపట్టారు. సోనియా గాంధీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే.. సభా హక్కుల తీర్మానం ప్రవేశపెడతామని మహిళా ఎంపీలు హెచ్చరించారు. అయితే.. దీనిపై సోనియా స్పందించారు. అధీర్ ఇప్పటికే క్షమాపణలు చెప్పారని, ఈ వివాదంలోకి తనను మాత్రం లాగొద్దని సోనియా అన్నారు.