మేఘాలయలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత కాన్రాడ్ కె. సంగ్మా వరుసగా రెండో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్ర గవర్నర్ ఫాగు చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తదితరులు పాల్గొన్నారు. సంగ్మాతో పాటు మరో 11 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మార్క్యూస్ ఎన్ మారక్, రక్కమ్ ఎ సంగ్మా, అంపరీన్ లింగ్డో, కమింగోన్ యంబోన్ మరియు ఎటి మోండల్ ఉన్నారు.
ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో NPP 26 సీట్లను గెలుచుకొని, అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే.. మేజిక్ ఫిగర్ కి చేరుకోకపోవడంతో… బీజేపీ, యూడీపీ లాంటి మిత్ర పక్షాలతో కలిసి కాన్రాడ్ సంగ్మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 2న వెల్లడయ్యాయి. మొత్తం 60 స్థానాలకుగాను ఒక అభ్యర్థి మరణంతో 59 స్థానాలు ఎన్నికలు జరిగాయి. అందులో ఎన్‌పీపీ 26, యూడీపీ 11, కాంగ్రెస్ 5, టీఎంసీ 5, వాయిస్ ఆఫ్ ద పీపుల్స్ పార్టీ 4, బీజేపీ 2, హెచ్‌ఎస్‌పీడీపీ 2, ఇండిపెండెంట్లు రెండు స్థానాల్లో గెలిచారు.