మునుగోడు ఉప ఎన్నికలంటూ వస్తే.. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ నిండా మునుగుతారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అంశం మాత్రమే కోమటిరెడ్డి కోర్టులోనే వుందని, దానిని సాగదీసే ఛాన్స్ వుంటుందని గుత్తా అంచనా వేశారు. అసలు కాంగ్రెస్ లో ఆయనకు ఎందుకు చికాకుగా వుందో.. ఆయనే బహిరంగ పరచాలని, ఆయనను రాజీనామా చేయమని ఎవరు కోరారని సూటిగా ప్రశ్నించారు. ఏ ప్రాంతానికి సంబంధించిన రాజకీయాలు ఆ ప్రాంతంలోనే వుంటాయని, హుజూరాబాద్ పరిస్థితులు, మునుగోడు పరిస్థితులు రెండూ వేర్వేరని ఆయన విశ్లేషించారు. ఎన్నికల సమయంలో లీడర్లు పార్టీలు మారడం అత్యంత సహజ ప్రక్రియ అని అన్నారు.
ఇక.. గవర్నర్ తమిళిసై వ్యవహార శైలిపై కూడా మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి స్పందించారు. అసలు గవర్నర్ రాజకీయాలు మాట్లాడొచ్చా? అంటూ ప్రశ్నించారు. రాజ్యాంగ పరంగా గవర్నర్ కు కొన్ని పరిమితులు వుంటాయని, వాటిని దాటం సరికాదన్నారు. రాజ్యాంగపరంగా నియామకమైన వారు రాజకీయాలు మాట్లాడటం ఏంటన్నారు. జమ్మూ కశ్మీర్ లో అసెంబ్లీ నియోజకవర్డాలను కేంద్రం పెంచిందని, ఏపీ, తెలంగాణలో పెంచకపోవడం సరికాదన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోనే ఈ అంశం వుందని గుర్తు చేశారు. రాష్ట్రంలో డెవలప్ మెంట్ జరగాలంటే.. అప్పులు తప్పని సరి అని, ఈ విషయంలో కేంద్రం రాష్ట్రాలను తప్పు పడుతోందని గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు.