సీపీఐ సీనియర్ నేత మెగాస్టార్ చిరంజీవికి సారీ చెప్పారు. తిరుపతి వేదికగా తాను చిరంజీవిపై చేసిన వ్యాఖ్యల విషయంలో పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని సీపీఐ నేత నారాయణ ప్రకటించారు. వాటిని భాషాదోషంగా మాత్రమే పరిగణించాలని నారాయణ కోరుకున్నారు. చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలకు తానెంతో చింతిస్తున్నానని, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని నారాయణ తెలిపారు. అటు చిరంజీవి అభిమానులు, కాపునాడు వారు అందరూ ఆ వ్యాఖ్యలను ఇంతటితో మరిచిపోవాలని కోరారు. రాజకీయాల్లో ఆరోపణలు, విమర్శలు సహజమని, రాజకీయాల్లో విమర్శలను సద్విమర్శలుగా తీసుకోవాలని నారాయణ సూచించారు.
భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవి హాజరు కావడాన్ని సీపీఐ నారాయణ తప్పుబట్టారు. చిరంజీవి ఊసరవెల్లి అని, చిల్లర బేరగాడు అంటూ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో మెగాస్టార్ అభిమానులు, సోదరుడు నాగబాబు నారాయణపై తీవ్రంగా మండిపడ్డారు. నారాయణ రోజూ అన్నం తినడం లేదని, ఎండుగడ్డి తింటున్నారని జనసేన నేత, మెగాస్టార్ సోదరుడు నాగబాబు ఎద్దేవా చేశారు. నారాయణకు గడ్డి తినడం మాన్పించి, కాస్త అన్నం పెట్టండి అంటూ నాగబాబు అభిమానులకు సూచించారు. దీంతో నారాయణ చిరంజీవికి క్షమాపణలు చెప్పారు.