గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సీపీఐ ఛలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఈ రాజ్ భవన్ ముట్టడిలో సీపీఐ నేతలు భారీగా పాల్గొన్నారు. రాజ్ భవన్ వైపు వెళ్తున్న సీపీఐ నేతలను ఖైరతాబాద్ చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సమయంలోనే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కిందపడిపోయారు. మరో వైపు రాజ్ భవన్ వైపు వెళ్తున్న కూనంనేనితో పాటు జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, అజీజ్ పాషా ఇతర ముఖ్య నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
గవర్నర్ వ్యవస్థ ప్రజాస్వామ్య విలువలను కాపాడేలా పనిచేసినట్టు ఇప్పటివరకు ఆధారాలు లేవని సీసీఐ నేతలు అన్నారు. గవర్నర్ వ్యవస్థతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, అందుకే ఈ వ్యవస్థను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగంలో బిల్లులను ఎంత కాలం నిలుపుదల చేయాలో.. గడువు లేకపోవడంతో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.