ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్, జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. కేవలం 40 రూపాయలతోనే తన మోకాలి నొప్పికి చికిత్స చేయించుకున్నారట ధోనీ. ధోనీ లాంటి సెలెబ్రెటీ ఆయుర్వేద వైద్యం చేయించుకున్నారని అందరూ తెగ ఆశ్చర్యపడిపోతున్నారు. కొన్ని రోజులుగా ధోనీ మోకాలి నొప్పితో తీవ్రంగా బాధపడుతున్నారు. దీంతో ఆయన రాంచీకి 70 కిలోమీటర్ల దూరంలో వున్న ఓ ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి వెళ్లి.. చికిత్స చేయించుకున్నారు. ఈ ఆయుర్వేద వైద్యుడు కేవలం 40 రూపాయలు మాత్రమే తీసుకున్నాడు.
మోకాలి నొప్పి తీవ్రంగా వుండటంతో ధోనీ కొన్ని రోజుల పాటు అల్లోపతి వైద్యం చేయించుకున్నారట. కానీ.. నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలోనే ధోనీ వందన్ సింగ్ అనే ఆయుర్వేద వైద్యుడ్ని సంప్రదించాడు. ధోనీ తల్లిదండ్రులకు కూడా ఈ వైద్యుడే వైద్యం అందించాడు. అందుకే ధోనీ ఆయన దగ్గరికి వెళ్లినట్లు ఆయన సన్నిహితులు అంటున్నారు. గత నెల రోజుల నుంచి ఈ వైద్యం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ధోనీకి వైద్యం చేస్తున్నా.. గొప్పగా ఫీలవుతున్నా…
ధోనీ లాంటి సెలెబ్రెటీకి వైద్యం చేస్తున్నందుకు గర్వంగా ఫీలవుతున్నానని ఆయుర్వేద వైద్యుడు వందన్ సింగ్ పేర్కొన్నారు. ఓ సాధారణ వ్యక్తిలా తన దగ్గరికి వచ్చి, వైద్యం చేయించుకుంటున్నాడని, అతనిలో గర్వమే లేదని పేర్కొన్నాడు. నాలుగు రోజులకోసారి వచ్చి చికిత్స చేయించుకుంటున్నాడని వైద్యుడు వెల్లడించాడు. ధోనీ తల్లిదండ్రులకు కూడా వైద్యం అందించానని వందన్ సింగ్ పేర్కొన్నాడు.