ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జీ తరుణ్ ఛుగ్ తో ఢిల్లీలో భేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి దాసోజు ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా తరుణ్ ఛుగ్ దాసోజును శాలువాతో సత్కరించారు. దాసోజు శ్రవణ్ గతంలో ఏబీవీపీలో పనిచేశారని గుర్తు చేశారు. అయితే.. దాసోజు శ్రవణ్ ఎప్పుడు బీజేపీలో చేరుతారన్నది మాత్రం ఛుగ్ స్పష్టతనివ్వలేదు. ఆదివారం కల్లా అన్ని విషయాలూ తెలుస్తాయన్నారు. అయితే… దాసోజు మాత్రం బీజేపీలో చేరుతున్నారని తరుణ్ ఛుగ్ అధికారికంగా ప్రకటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను దోచుకుంటోందని ఛుగ్ మండిపడ్డారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు బీజేపీలో వుంటాయని ఛుగ్ ప్రకటించారు.
నేతలకు తామే డబ్బులిచ్చి చేర్చుకునే కల్చర్ బీజేపీది కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన కోమటిరెడ్డి, దాసోజు శ్రవణ్ ఎందుకు పార్టీ మారుతున్నారో అర్థం చేసుకోచవచ్చన్నారు. గతంలో సోనియాను తిట్టిన వారే, ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షులయ్యారని పరోక్షంగా రేవంత్ రెడ్డిని బండి సంజయ్ విమర్శించారు.