మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఏకనాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం రాత్రి 7:30 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ రాజ్ భవన్ లో ఏకనాథ్ తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అయితే.. ప్రస్తుతానికి ఏకనాథ్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారు. మిగతా మంత్రులెవ్వరూ ప్రమాణ స్వీకారం చేయరని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా ఏకనాథ్ షిండే ప్రధాని నరేంద్ర మోదీకి, దేవేంద్ర ఫడ్నవీస్ కి ధన్యవాదాలు తెలిపారు. వారికి పూర్తి స్వేచ్ఛ, అందుకు తగ్గ వాతావరణం కూడా వుందని, అయినా.. బీజేపీ తనను ముఖ్యమంత్రిగా చేసిందని, ఇలా ఎవరు చేస్తారు? అని ఏకనాథ్ వ్యాఖ్యానించారు.
బాలాసాహెబ్ హిందుత్వ సిద్ధాంతం, హిందుత్వ భావజాలం కోసమే తాను ముఖ్యమంత్రి పదవి చేపడుతున్నానని ఏకనాథ్ షిండే సూటిగా స్పష్టం చేశారు. తమ తమ ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధి ఎజెండా కూడా ఇందులో మిళితమై వుంటుందని, అందులో అనుమానమే లేదని స్పష్టం చేశారు. అయితే.. తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్ని అర్హతలున్నా… ఫడ్నవీస్ తనకు అవకాశం వచ్చేలా చేశారని, అందుకు ఆయన ధన్యవాదాలు ప్రకటిస్తున్నట్లు ఏకనాథ్ పేర్కొన్నారు.
ఫడ్నవీస్ ది పెద్ద మనస్సు అని, తనకు మద్దతిచ్చిన బీజేపీ అధిష్ఠానానికి, ఇతరులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ- శివసేన పొత్తు అనేది సర్వ సాధారణమని అన్నారు. కానీ.. మహావికాస్ అగాఢీ అనేది కేవలం స్వార్థం కోసం ఏర్పడిన కూటమి అని, ఏ ఎమ్మెల్యే కూడా సంతోషంగా లేరని ఏకనాథ్ ప్రకటించారు.