పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ లో అంతర్భాగమేనని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇకపై కూడా ఈ ప్రాంతాలు భారత్ లోనే కొనసాగుతాయని తేల్చి చెప్పారు. ఈ మేరకు 1994 లో పార్లమెంట్ లో పాసైన తీర్మానాన్ని కూడా ఆయన ప్రస్తావించూ… ప్రసంగించారు. శివుని రూపంలో బాబా అమర్ నాథ్ మనతోనే వున్నారని, మాత శారదా శక్తి ఎల్ఏసీ అవతల వుండడం సాధ్యమా? అంటూ సూటిగా ప్రశ్నించారు. 1947 నుంచి పాకిస్థాన్‌ను భారత్ ఓడిస్తూనే ఉందని, ఆ ఓటమి తరువాత పాక్ బూటకపు పరోక్ష యుద్ధాలకు పాల్పడుతోందని రక్షణ మంత్రి తెలిపారు.
1965, 1971ల్లో ప్రత్యక్ష యుద్ధాలలో పాక్ పరాజయాన్ని చవి చూశాక, భారత్‌లోకి చొరబడడానికి అనేక పన్నాగాలు పన్నుతోందని మండిపడ్డారు. కానీ మన వీర సైనికులు ధైర్యసాహసాలతో దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వానికి ఎలాంటి నష్టం కలగకుండా తమ శౌర్యాన్ని ప్రదర్శిస్తున్నారని రక్షణ మంత్రి ప్రశంసించారు. పాక్, చైనాలతో యుద్ధాలు సంభవించినప్పుడు జమ్ముకశ్మీర్ ప్రజలు సైనికులతో ధైర్యంగా నిల్చున్నారని కొనియాడారు. శారదా పీఠాన్ని రక్షణ మంత్రి ప్రస్తావిస్తూ, పీఓకేలోని ముజఫరాబాద్ నుంచి సుమారు 150 కిలోమీటర్ల దూరంలోని నీలుమ్ వ్యాలీలో ఈ పీఠం ఉందని, కశ్మీర్ పండిట్లకు మతపరమైన ప్రాధాన్యం కలిగిన ప్రాంతమిదని తెలిపారు.