ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుపై ఆమ్ ఆద్మీ హర్షం వ్యక్తం చేసింది. తమ పార్టీకి ఘన విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు ప్రకటించారు. ఢిల్లీ ఆప్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సభలో కేజ్రీవాల్ ప్రసంగించారు. ఢిల్లీ ప్రజల ఆకాంక్షల్ని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఢిల్లీ నగరాన్ని మరింత మెరుగు పరిచేందుకు తాము ప్రయత్నం చేస్తామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ తో పాటు, ప్రధాని మోదీ ఆశీర్వాదం తమకు కావాలని ఆకాంక్షించారు. ఢిల్లీని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతి, లంచగొండి తనాన్ని నిర్మూలిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
హోరా హోరీగా సాగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ మెజారిటీ మార్క్ ను దాటేసింది. దీంతో గెలుపు ఖాయం చేసుకుంది. మొత్తం 250 వార్డుల్లో మెజారిటీ మార్క్ అయిన 126 ను దాటి… 129 స్థానాల్లో చీపురు విజయం సాధించింది. మొత్తం 129 స్థానాల్లో ఆప్ విజయ కేతనం ఎగరేయడంతో మేయర్ పీఠంపై ఆప్ కూర్చోనుంది. మెజారిటీ మార్క్‌ను దాటి ఆప్ విజయం దిశగా దూసుకుపోవడంతో ఫలితాలు అధికారికంగా వెలువడక ముందే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టేశారు. ఢిల్లీలోని ఆప్ కార్యాలయం వద్ద పెద్దఎత్తున కార్యకర్తలు నృత్యాలు చేస్తూ, కేజ్రీవాల్ నినాదాలు హోరెత్తించారు.