కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి పి.పి. మాధవన్ (71) పై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, అత్యాచారానికి పాల్పడ్డారని 26 ఏళ్ల వయస్సున్న అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఢిల్లీ పోలీసులు మాధవన్ పై కేసు నమోదు చేశారు. అయితే ఈ ఆరోపణలను మాధవన్ తీవ్రంగా ఖండించారు. కేవలం కాంగ్రెస్ పరువు తీయడానికే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఈ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని అన్నారు. ఇదో కుట్ర అని అభివర్ణించారు.
తన భర్త కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హెల్పర్ గా పనిచేసేవాడని, కోవిడ్ సమయంలో మరణించినట్లు ఆ మహిళ పేర్కొంది. ఉద్యోగం కోసం తరుచూ కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్తుంటానని, ఉద్యోగం కోసం మాధవన్ నెంబర్ తీసుకున్నట్లు ఆమె చెప్పింది. ఇంటర్వ్యూ కోసం జనవరి 21 న సురేంద్రనగర్ లోని ఓ ఇంటికి వెళ్లాలని, అక్కడే అత్యాచారానికి గురయ్యానని ఆ మహిళ పోలీసులతో పేర్కొంది.