కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంపై స్టే విధించమని, ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వమని, వాదనలు పూర్తయ్యే వరకూ వింటామని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. అగ్నిపథ్ ను సవాల్ చేస్తూ నియామకాలన్నీ కోర్టు తీర్పుకు లోబడే ఉండేలా ఆదేశాలివ్వాలంటూ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. సీజే సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ సుబ్రమణియమ్ ప్రసాద్ తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేసింది. విచారణ ముగిసే వరకూ అగ్నిపథ్ పై స్టే విధించాలని కోరగా… అందుకు కోర్టు తిరస్కరించింది. అయితే… నియామకాలన్నీ కోర్టు తీర్పుకు లోబడే వుండాలని కోరగా… అది ఎప్పుడూ వుంటుందని కోర్టు పేర్కొంది. ఇక… అగ్నిపథ్ కు సంబంధించిన వివిధ అంశాలపై పిటిషన్లు ఫైల్ అయ్యాయని, వీటికి రిప్లై పిటిషన్లు ఫైల్ చేయాలని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్గు ఆదేశించింది.
మరోవైపు అగ్నిపథ్ కింద భారత సైన్యంలోకి గూర్ఖాలను నియమించే ప్రక్రియను నేపాల్ నిలిపేసింది. ఈ సమాచారాన్ని భారత రాయబారికి అందించింది. అయితే దీనిపై భారత్ స్పందించింది. నేపాల్ నుంచి గుర్ఖా సైనికులను చేర్చుకునే ప్రక్రియ చాలా కాలంగా కొనసాగుతోందని, అగ్నిపథ్ కింద కసరత్తు కొనసాగుతుందని భారత్ పేర్కొంది.