ధవళేశ్వరం కాటన్ బ్యారెజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. లంక గ్రామాలను గోదావరి ముంచెత్తుతోంది. బ్యారెజ్ వద్ద 15.20 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. ఇక.. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ నుంచి 15 లక్షల 21 వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలున్నాయని అధికారులు ప్రకటించారు. ఒకవేళ అధికారులు గనక.. మూడో ప్రమాద హెచ్చరికలు జారీచేస్తే.. 31,382 కుటుంబాలు, 1,25,380 మంది ప్రజలపై తీవ్ర ప్రభావం కూడా చూపుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వరద ప్రవాహాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే వున్నారు. ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ప్రభుత్వ స్పెషల్ సీఎస్ సాయి ప్రసాద్, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కూడా వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. కింది స్థాయి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, కేంద్ర బలగాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఎప్పటికప్పుడు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.