ప్రస్తుతం బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు రోజుల క్రిందటే బీజేపీ ఎమ్మల్యే ఈటల రాజేందర్ పై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలకు దిగారు. అయితే… బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మాత్రం ఈటల, కేటీఆర్ మధ్య ఆసక్తికర చర్చలు జరిగాయి. అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్ తో కూడా కేటీఆర్ సరదాగా సంభాషించారు. హుజూరాబాద్ లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే కేటీఆర్ ని ప్రశ్నించారు. పిలిస్తే కదా…. హాజరయ్యేది అంటూ ఈటల సమాధానమిచ్చారు. కనీసం కలెక్టర్ అయినా ఆహ్వానం పంపాలి కదా అని అనగా… కేటీఆర్ నవ్వి ఊరుకున్నారు. ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి వెళ్లే ప్రాక్టీస్ సరిగాలేదని ఈటల పేర్కొన్నారు.
ఈటల, కేటీఆర్ మధ్య సంభాషణ జరుగుతుండగానే సీఎల్పీ నేత భట్టివిక్రమార్క వచ్చారు. తనకు సైతం అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానం అందడం లేదని ఫిర్యాదు చేశారు. ఇక.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తో కూడా కేటీఆర్ సరదాగా సంభాషించారు. కాషాయ రంగు షర్ట్ కళ్లకు గుచ్చుకుంటోందన్నారు. తనకు ఆ రంగు ఇష్టముండదని కేటీఆర్ అన్నారు… కాషాయ రంగు చొక్కాను భవిష్యత్తులో మీరూ వేసుకోవచ్చేమో అంటూ రాజాసింగ్ సరదాగా కేటీఆర్ తో అన్నారు. ఇంతలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వచ్చి… సభలోకి గవర్నర్ వస్తున్నారని అనడంతో కేటీఆర్ తన స్థానంలోకి వెళ్లిపోయారు.
కొన్ని రోజుల కిందటే హుజూరాబాద్ లో జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే ఈటలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నాడని అన్నారు. ఎవరి పాలన దేశానికి అరిష్టదాయకమో ఈటలకు తెలియదా? అని ప్రశ్నించారు. ప్రజల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మోదీ చెప్పారు… ఆ రూ.15 లక్షలు ఎవరి ఖాతాలో పడ్డాయి? అని కేటీఆర్ నిలదీశారు. ఈటలను హుజూరాబాద్‌కు పరిచయం చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. రాజకీయ జన్మ ఇచ్చిన కేసీఆర్‌పై ఈటల విశ్వాస ఘాతకుడిలా ఇష్టం వచ్చినట్లు మా ట్లాడతున్నాడన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపి గెలిస్తే అద్భుతాలు చేసి చూపిస్తామన్నారని, 14 నెలలు గడిచింది, ఈటల గెలిచి ఏం చేశాడో చెప్పాలన్నారు. హుజూరా బాద్ గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్నారు.