మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఒకప్పటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ దిగ్విజయ్ సింగ్ ఎంటర్ అయ్యారు. దిగ్విజయ్ సింగ్ గురువారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేశారు. పార్టీ మారవద్దని సూచించారు. రెండు రోజుల్లోగా ఢిల్లీకి రావాలని, కూర్చొని మాట్లాడుకుందామని డిగ్గీరాజా ఆహ్వానించారు.
అంతకు పూర్వం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ పీసీసీ నేతలు భేటీ అయ్యారు. కోమటిరెడ్డి వివాదంపై లోతుగా చర్చించారు. ఈ చర్చ తర్వాతే దిగ్విజయ్ సింగ్ కోమటిరెడ్డికి ఫోన్ చేశారు. దాదాపు 2 గంటల పాటు ఈ చర్చలు జరిగాయి. ఎలాగైనా ఎమ్మెల్యే కోమటిరెడ్డిని బుజ్జగించాలని, ఆయన పార్టీలోనే వుండేట్లు చూడాలని రాష్ట్ర నేతలకు కేసీ వేణుగోపాల్ సూచించారు. దీంతో రాష్ట్ర నేతలు శనివారం ఎమ్మెల్యే కోమటిరెడ్డితో భేటీ కానున్నారు. ఆయన్ను బుజ్జగించనున్నారు.