కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ (92) కన్నుమూశారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు, తెలుగుదనాన్ని, సంప్రదాయాన్ని ప్రతిబింబించే సినిమాలు అందించిన ఘనత ఆయనకే దక్కింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబీకులు జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 5 దశాబ్దాల పాటు తెలుగు సినిమా రంగంపై తనదైన ముద్రను వేసిన కళాతపస్వి కన్నుమూయడంతో చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో నిండిపోయింది. 1966లో ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విశ్వనాథ్.. సిరిసిరిమువ్వ, సాగర సంగమం, శంకరాభరణం, స్వాతికిరణం, సప్తపది, ఆపద్బాంధవుడు వంటి ఎన్నో ఆణిముత్యాలను అందించారు. ఆయన ప్రతి సినిమాలో సంస్కృతి సంప్రదాయాలకు, కళలకు పెద్దపీట వేశారు. పలు సినిమాల్లో కూడా నటించారు.
కె. విశ్వనాథ్ స్వస్థలం బాపట్ల జిల్లా పెదపులివర్రు గ్రామం. 1930 ఫిబ్రవరి 19 న కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్ జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్, ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆయన తండ్రి చెన్నైలోని విజయవాహనీ స్టూడియోలో పనిచేసేవారు. దీంతో విశ్వనాథ్ అదే స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్ గా సినీ జీవితాన్ని ప్రారంభించేశారు. తొలిసారి పాతాళ భైరవి సినిమాకి అసిస్టెంట్ రికార్డిస్ట్ గా పనిచేశారు. 1957లో వచ్చిన ‘తోడికోడళ్లు’ సినిమాకు సౌండ్ ఇంజనీర్ గా సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దగ్గర ‘చదువుకున్న అమ్మాయిలు’, ‘మూగమనసులు’, ‘ఇద్దరుమిత్రులు’, ‘డాక్టర్ చక్రవర్తి’ వంటి పలు సినిమాలకు కో డైరెక్టర్గా పనిచేశారు. 1965లో ‘ఆత్మగౌరవం’ సినిమాను విశ్వనాథ్ తెరకెక్కించారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంతాపం
కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూతపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖ దర్శకుడు కళా తపస్వి, పద్మశ్రీ కే విశ్వనాథ్ మృతిపై సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథను ఎంచుకొని తన అద్భుతమైన ప్రతిభతో వెండితెర దృశ్య కావ్యాలుగా మలిచిన అరుదైన దర్శకుడు కే విశ్వనాథ్ అని కొనియాడారు. గతంలో కే విశ్వనాథ్ ఆరోగ్యం బాగాలేనప్పుడు వారి ఇంటికి వెళ్లి పరామర్శించిన సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య జరిగిన చర్చను సీఎం ఈ సందర్భంగా గుర్తుచేసుకొన్నారు. భారతీయ సామాజిక సంస్కృతి సంప్రదాయ విలువలకు తన సినిమాలో పెద్దపీట వేశారని సీఎం పేర్కొన్నారు.
విశ్వనాథ్ మరణం తనను తీవ్ర విచారానికి గురి చేసిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. తెలుగు సంప్రదాయం, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్ అని, ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీ రంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయని, తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారని అన్నారు.