ద్రౌపది ముర్ము… అత్యంత కుగ్రామంలో పుట్టి… దేశ అత్యున్నతమైన రాష్ట్రపతి పీఠం దాకా సాగింది ఆమె జైత్రయాత్ర. ముర్ము ఒడిశాలోని అత్యంత వెనుకబడిన జిల్లాలో జన్మించారు. అంతేకాకుండా అత్యంత వెనుకబడిన సంతాల్ గిరిజన కుటుంబంలో. ఆమె జీవిత యాత్ర అంతా అత్యంత ఆసక్తికరమే. అత్యంత అట్టడుగు స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ఎదిగారు. ఎలాంటి సౌకర్యాలు లేకున్నా… వాటన్నింటినీ అధిగమిస్తూ.. అసమాన పట్టుదలతో ఎదిగిన గిరిజన మహిళ… ఆమె వ్యక్తిగత జీవితంలో విషాదాలు జరిగాయి. అయినా.. వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డారు. నెలకు కేవలం 10 రూపాయలతో కాలేజీ జీవితం గడుపుతున్నప్పుడు ఎలాంటి జీవన శైలిలో వున్నారో… ఇప్పటికీ అదే జీవన శైలిలో వున్నారు. జార్ఖండ్ గవర్నర్ గా పదవీ విరమణ చేసిన తర్వాత.. స్వస్థలానికి వచ్చేశారు. ముందు నుంచీ తనకు సంక్రమించిన సాదాసీదా ఇంట్లోనే జీవితం గడుపుతున్నారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి 1997 లో బీజేపీలోకి
ముర్ము ఒడిశాలని మయూర్ భంజ్ జిల్లా ఉపర్ బేడ గ్రామంలో 1958 జూన్ 20 న జన్మించారు. ఆమె తండ్రి విరంచి నారయణ్ తుడు. పట్టుదలతో స్కూలు చదివి, ఆ తర్వాత కాలేజీ చదువు పూర్తి చేశారు. జూనియర్ అసిస్టెంట్ గా, స్కూల్ టీచర్ గా పనిచేశారు. రాయ్ రంగాపూర్ లోని అరబిందో ఇంటెగ్రిల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశారు. 1997 లో బీజేపీతో రాజకీయ రంగప్రవేశం చేశారు. రాయ్ రంగాపూర్ నగర పంచాయతీ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. 2000 లో అదే పంచాయతీకి చైర్ పర్సన్ అయ్యారు. ఆ తర్వాత బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా, తర్వాత మంత్రిగా పనిచేశారు. 2007 లో ఎమ్మెల్యేగా న్నికై… బెస్ట్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. 2015 లో జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్ అయ్యారు.
భర్తను, కొడుకులను పోగొట్టుకొని…
2009 లో ముర్ము పెద్ద కుమారుడు అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. ఆ తర్వాత 3 సంవత్సరాలకే రోడ్డు ప్రమాదంలో రెండో కొడుకు కూడా చనిపోయాడు. 2014 లో భర్త శ్యామ్ చరణ్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే 2009-15 మధ్య అంటే 6 ఏళ్ల వ్యవధిలో భర్తతో పాటు ఇద్దరు కొడుకులు, తల్లి, సోదరుడినీ కోల్పోయారు. ఈ విషాదమే తనను ఆధ్యాత్మిక బాట పట్టించిందని, బ్రహ్మ కుమారీలతో సంబంధాలు ఏర్పడ్డాయని ఆమె ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకున్నారు. ఈ విషాద ఘటనలతో తీవ్ర విషాదంలో కుంగిపోయా. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. అప్పుడే బ్రహ్మకుమారీల ఆశ్రమాన్ని సందర్శించా. నా కుమార్తె కోసం జీవించాలని నిర్ణయించుకున్నా అని ముర్ము అప్పట్లో వెల్లడించారు.